Tuesday, 9 July 2019

గుమ్మడి వెంకటేశ్వర రావు - Gummadi Venkateswara Rao - Pencil sketch

 
గొప్ప నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావు గారి చిత్రం వేసుకునే భాగ్యం నా pencil కి దక్కింది. వారి గురించి Dr. Prasad Kvs గారి మాటల్లో తెలుసుకుందాం. 

*ఏం బ్రదర్....ఆ చేతికున్న ఉంగరం ఏమైంది?...నిన్న ఉంది. నేను చూచాను.*....
నందమూరి సున్నితంగానే అడిగినా...ఆ గంభీరమైన వాయిస్ వింటే...కొంచెం కంగారు పడ్తూ...*అదీ...ఎక్కడో పోయినట్లుంది బ్రదర్*....అంటూ సర్దుకుంటున్న ఆయన భుజాన చేయి వేసి...
*ఈ నెల్లో మీ సంపాదన ఎంత బ్రదర్. ఇంటికెంత పంపించారు! నెలకు పాతిక సంపాదించి...యాభై ఖర్చు చేస్తే....మరి ఉంగారాలుంటాయా! మన ఆదాయానికి తగ్గట్టే....ఖర్చు ఉండాలి బ్రదర్. హోటల్ కు రిక్షాలో పోవడమెందుకు!....నడిచి పోయి వస్తే....తిన్నది బాగా అరుగుతుంది కూడా. పెళ్ళైన మగవాడు....తనగురించి...తన సరదాల గురించే కాదు బ్రదర్...పొదుపు చేసి ఇల్లు గడపాలి. ఒక్కసారి ఈ అప్పులు....తాకట్టులూ అంటూ మొదలు పెట్తే...ఇక పురోగతి ఉండదు బ్రదర్.*...
ఎన్.టి.ఆర్.....చెప్పిన ఈ మాటలు...ఆ వ్యక్తికి గుణపాఠం నేర్పించిందంటే అతిశయోక్తి కాదు. ఆయన మరెవరో కాదు....తెరమీద....ఆ నందమూరికే...ఎన్నో చిత్రాలలో తండ్రి పాత్రలు వేసి....బుధ్ధులు...సుద్దులు...నేర్పించే....గుమ్మడి వెంకటేశ్వర రావు గారే!
***********************
*రావికంపాడు లో పుట్టినా...స్కూలింగ్ కొల్లూరు లో జరిగింది. తెలుగు మాస్టారు జాస్తి శ్రీరాములు గారి పుణ్యం.....స్వఛ్ఛమైన తెలుగు ఉచ్చారణ పట్టుబడింది. హిందూ కాలేజ్ గుంటూర్లో....ఇంటర్ చదువుతుండగా...నాటకాలు...నటన తో బాటు....కమ్యూనిస్టు భావజాలం కూడా పట్టుబడింది. 17 ఏళ్ళకే...ముసలి తండ్రి వేషంలో....బెస్ట్ యాక్టర్ బహుమతి కొట్టేశాడాయన!*
*సీనియర్ శ్రీరంజని గారి కుమారుడు....మల్లికార్జునరావు(ఆ తరువాత దర్శకుడయ్యారు)....గుమ్మడి గారి రూపురేఖలు చూసి....*తప్పక హీరో అయిపోతావ్....అని ఎంకరేజ్ చేసి...మద్రాస్ బాట పట్టించారు!*
*మద్రాస్ లో పలానా గుమ్మడి వెంకటేశ్వర రావు వస్తున్నాడు....తెనాలి నుండి...రేడియోల షాపు...ఇంకా కుటుంబాన్ని వదలి....అతనికి పాత్రలు ఇవ్వాలి....అని ఏ నిర్మాత ....మద్రాస్ లో కాచుక్కూచ్చోడు కదా!ఎక్కే గుమ్మం....దిగే గుమ్మం!*
*అప్పుడు ఆదుకున్నది...నందమూరే!
తన రూం లో అప్పటికే రూం మేట్స్ గా.... టి.వి.రాజు, డి.యోగానంద్ ఉండేవారు. ప్రక్క రూం ఇప్పించారు తక్కువ అద్దెలో గుమ్మడి గారికి ఎన్.టి.ఆర్.*
*1950 లో డి.ఎల్. నారాయణ...తీసిన అదృష్టదీపుడు తో మొదలైంది గుమ్మడి గారి సినీప్రస్థానం. అది 60 ఏళ్ళ పాటు కొనసాగుతుందని....బహుశా ఆయన కూడా ఊహించిఉండరు. 2010 లో తీసిన.... జగద్గురు శ్రీ కాశినాయన చరిత్రం....గుమ్మడి గారి చివరి చిత్రం.*
*బి.వి. రామానందం గారు....జైవీర బేతాళ...అనే మూవీ జమున హీరోయిన్ గా...గుమ్మడి హీరోగా మొదలు పెట్టినా.....కారణాంతరాల వల్ల ఆగిపోయింది!*
*అప్పుడూ...వెన్నుతట్టి ప్రోత్సహించింది....అన్నగారే! 1953 లో సొంత బానర్ ఎన్.ఎ.టి. సంస్థ తీసిన పిచ్చిపుల్లయ్య లో...1954 లో తీసిన తోడుదొంగలు లో....అద్భుతమైన పాత్రలిచ్చి ప్రోత్సహించారు. దానితో గుమ్మడి గారి ప్రతిభ వెలికొచ్చింది.*
********************
*చచ్చిన చావు...చావకుండా, రకరకాలుగా చచ్చే పాత్రల్ని పోషించాలంటే...నిజంగా చచ్చేంత చావుగా ఉంది !*
*1962లో ఆదుర్తి సుబ్బారావు గారు...ఏముహూర్తంలో...ఆ దగ్గుతూ దగ్గుతూ...గుండెపట్టుకుని ...చనిపోయే రోల్ ఆయనకు ఇచ్చారో గానీ...అలాంటి పాత్రలన్నీ ....ఆయన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి మరి!*
* వారి ప్రతిభ అనన్య సామాన్యం. తడిగుడ్డతో గొంతు కోసే విలనీ పాత్రలు (తోడుదొంగలు, లక్షాధికారి, భలే రంగడు,రాజ మకుటం, వాగ్ధానం,ఇద్దరు మిత్రులు
....లాంటివి)...
పౌరాణికాలలో....
బలరాముడు,ధర్మరాజు, విశ్వామిత్రుడు, దశరథుడు,భృగు మహర్షి, దూర్వాసుడు, పరశురాముడు, ద్రోణుడు....పాత్రలు తలుచుకుంటే గుర్తొచ్చేది ఒక్క ఆయనే !*
**********************
*రాయా...రాయా....విచారించకు నాయనా...నాకీ నీలాపనింద...నీకీ అపకీర్తి....పూర్వకర్మ ఫలితాలే! పశ్చాత్తాపంతో...పరిశుధ్ధాత్ముడవై...ఇతోధిక వాత్సల్యంతో...నువ్వు నాకు దక్కావు రాయా*.....అంటూ పతాక సన్నివేశంలో మహామంత్రి తిమ్మరుసు పాత్రలో వారి పలుకులు....కళ్ళు మూసుకుని విన్నా....కన్నీళ్ళు రాక మానవు! అలాంటి డిక్షన్ ఆయన సొంతం!*
*ప్రతి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు....తప్పక చూసి....పాత్రలను స్టడీ చేయడం....ఆయన హాబీ. అండర్ ప్లే చేయడంలో...సిధ్ధహస్తుడు!*
*ఎన్.టి.ఆర్. పుట్టింది 1923లో...ఎ.ఎన్.ఆర్ జననం 1924లో...
గుమ్మడి వెంకటేశ్వర రావు పుట్టింది 1927 లో*!
*మనుషుల్లో దేవుడు మూవీలో...ఎన్..టి.ఆర్....గుమ్మడిని ఉద్దేశించి....* మీచలవే లేకుంటే నేను బి.ఏ. యూనివర్సిటీకే ఫస్టున వచ్చేవాడినా బాబుగారూ...అని పాదాభివందనం చేస్తాడు.
*నా దేముంది నాయనా...అంతా నీకృషే...నీ పట్టుదలే నీకీ ఫలితాన్నిచింది నాయనా*...అంటూ హత్తుకుంటారు వృధ్ధ పాత్రలో గుమ్మడి!
**********************
*నీకీనాడు కన్నవాళ్ళు గుర్తు రారురా...ఆ కులం గోత్రం లేని పిల్ల కోసం....కన్నవాళ్ళను, తోబుట్టువులను కాదని గడప దాటి వెళ్తున్నావు కదా...వెళ్ళరా..వెళ్ళు...అని.....ఎ.ఎన్.ఆర్ ను కులగోత్రాలు మూవీలో తండ్రి పాత్రలో రుధ్దమైన గంభీరమైన కంఠం తో తీక్షణ ధృక్కులతో గుమ్మడి గర్జిస్తుంటే....ప్రేక్షకులు దృశ్యంలో లీనమైపోయారు*-
****************
*ఈ కుర్రాడు నా ప్రక్కన భర్త రోల్ ....అదీ జమిందార్ రోల్.... నాకంటే 9 ఏళ్ళు చిన్నవాడు...ఎలా చేస్తాడు!?*..అని శాంత కుమారి గారు విసుక్కుంటే....అర్ధాంగి మూవీలో మేకప్ మాయతో....సీన్లు పండిస్తుంటే....ఆవిడ ఆశ్చర్యపోయారట గుమ్మడి గారి ప్రతిభకు.*-
*విలనీ, హాస్యం, రౌద్రం, కరుణ, బీభత్స & భయానక రసాలను మహా గొప్పగా పోషించి ఒప్పించేవారు గుమ్మడి గారు*-
*ఏవండీ...నేను తీర్థయాత్రలకెళ్ళాలని మొక్కుకున్నాను.కంచి కామాక్షిని, మధుర మీనాక్షిని, బెజవాడ కనకదుర్గను,కాశీ విశాలాక్షిని, రామేశ్వరంలో ఆ మహాశివుని....అని సూర్యకాంతం అంటుంటే...భర్త గుమ్మడి తో.....
*ఇంకొక్క పని చెయ్యవే...ఆ కాస్త సముద్రం దాటి లంకలో మీ అన్న రావణాసురుని కూడ దర్శించుకుని వద్దాం!* అని గుమ్మడి ఎంతో అమాయకంగా అత్యంత సహజంగా అనే మాటకు ప్రేక్షకుల నవ్వులు హాలంతా విరబూశాయి...పూలరంగడు మూవీలో.*
*********************
*ఐ విష్ టు సీ దశరథ*.....అంటూ సెట్టులోకొచ్చిన... దాదాముని అని పేరొందిన హిందీ నటుడు అశోక్ కుమార్ ను....ఆ సెట్లో ఉండే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తుంటే....ఓ ప్రక్క సోఫా లో కునికి పాట్లు పడుతున్న....ఓ విధంగా నిద్రే పోతున్న గుమ్మడి గారిని చూచి....* డోంట్ డిస్టర్బ్ హిం. ఐ షెల్ వెయిట్.*....అని గుమ్మడి గారు మళ్ళీ నిద్రలేచేవరకు ఉండి....*దేర్....మై డియర్ దాదా ముని ఆఫ్ సౌత్....అంటూ షేక్ హేండ్ ఇస్తుంటే....అది కలో....నిజమో అర్ధం కాలేదు గుమ్మడి గారికి. చిన్నప్పటి నుండి...హిందీ లో తన అభిమాన నటుడు అశోక్ కుమార్ గారు. నోట మాటరాక తబ్బిబ్బౌతుంటే....*యు ఆర్ యాన్ ఎక్సెలెంట్ యాక్టర్...సర్. ఐ లైక్ యువర్ పోర్ట్రేయల్ ఆఫ్ దశరథ.* ....అంటూ భుజం చుట్టూ చేతులేసి మెచ్చుకున్న సందర్భం....నాకు మరువరాని మధుర జ్ఞాపకం...అనేవారు గుమ్మడి గారు.*
***********************
*కాలంతో బాటు మనుషులూ ఎదుగుతారు. స్వభావాలలో మార్పు సహజం. ఎవరు ఒప్పుకున్నా...ఒప్పుకోకపోయినా...అప్పట్లో....ఎన్.టి.ఆర్ గ్రూప్.....ఎ.ఎన్.ఆర్. గ్రూప్....అంటూ ఉండేవి తెలుగు సినీరంగాన! ఆ కాంప్ లో నటుడు....ఈ కాంప్ లో మనలేడు! కానీ ఈ కాంపులకు అతీతంగా అందరికీ కావలసిన వ్యక్తులు నలుగురు. ఎస్.వి.ఆర్, గుమ్మడి, సూర్యకాంతం & సావిత్రి.*
***************************
*సావిత్రి గారు ప్రాభవం బాగా తగ్గిపోయి...చిన్న పాత్రలు కూడా...చేస్తున్న రోజుల్లో....మధ్యాహ్నం 3 గంటలవుతున్నా...లంచ్ చేయక...చెట్టు క్రింద అరుగు మీద కూర్చుని ఉంటే.....గమనించి....*అమ్మా...సావిత్రి....ఏమిటి...భోజనమయ్యిందా?* అని ఆరాతీస్తే....ఆకలిగాలేదని...మొహమాటపడుతుంటే...క్యారియర్ తెప్పించి అన్నం తినేలా చూచి....*కాలమహిమ కాకపోతే...ఏమిటీ విడ్డూరం!* అని ఆర్ద్రతతో కరిగిపోయింది గుమ్మడి గారే!
ఎవరికైనా....వైభవం కొంతకాలమే! ఎంతటి వారైనా విధికి... తలవంచాల్సిందే కదా!*
*****************************
*1995 లో వచ్చిన ఆయనకిద్దరు మూవీ లో ఆరోగ్యరీత్యా సహకరించక...నూతన్ ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పారు గుమ్మడి గారికి. అప్పుడే....ఆయన ఎంతో బాధ పడ్డారు.*
అన్నిభాషలలో కలిపి....500 పైగా....సినిమాలు!
నేషనల్ ఫిల్మ్ అవార్డులకు జ్యూరీ మెంబర్ గా 3 సార్లు...గౌరవం.
మహామంత్రి తిమ్మరుసు(1963), మరో మలుపు(1982)...ఈ రెండు చిత్రాలు....ఇంటికి రెండు నందులను తెచ్చాయి.
1977లో పద్మశ్రీ పురస్కారం.
జ్యోతి & సీతాకళ్యాణం....పాత్రలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు.
రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం.
*తీపిగుర్తులు - చేదుజ్ఞాపకాలు.......ఆయన విరచితమైన అద్భుతమైన పుస్తకం.*
*ఇవన్నీ ఓ ఎత్తైతే....2010 జనవరి లో... డిజిటలైజ్ చేసిన మాయాబజార్ వర్ణ చిత్రం....చూసి....బహుశా ఇది చూసి తరించడానికే....నేను ఇంకా బ్రతికున్నానేమో....అని ఆయన మురిసి పోవడం....ఆ తరువాత...26 జనవరి 2010 న మన ప్రియతమ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావు గారు....స్వర్గస్తులవడం జరిగింది.*
*9 జూలై.....కీ.శే.గుమ్మడి వెంకటేశ్వర రావు గారి జయంతి సందర్భంగా ....వారికి స్మృత్యంజలి.*
*చిన్న వయసులోనే.....పెద్దపెద్ద పాత్రలకు అంకితమైనా....గుమ్మడి గారి సహజ నటన తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. తెలుగువారి గుండెల్లో గుమ్మడి గారి స్థానం సుస్థిరం.*-

Thursday, 4 July 2019

SV Ranga Rao - Pencil sketch


Samarla Venkata Ranga Rao (3 July 1918 – 18 July 1974), popularly known as S.V.R., was an Indian film actor, director and producer known for his works in Telugu cinema and Tamil cinema. Regarded as one of the finest method actors in the history of cinema and one of the greatest actors in Telugu Cinema, Rao was popularly known as "Viswa Nata Chakravarthi".

"బాబూ వినరా.. అన్నా తమ్ములా కథ ఒకటి" అంటూ ఎన్నో ఆశలతో పెంచుకున్న అనుబంధం ముక్కలైతే కంటనీరు ఒలికించే ఇంటిపెద్దగా, "వివాహ భోజనంబు, వింతైన వంటకంబు" అంటూ ఘటోత్కచుడిగా, "డోంగ్రే, గూట్లే.. మాట తప్పావ్, పచ్చి నెత్తురు తాగుతా" అంటూ కర్కశమైన రౌడీగా... నరకాసురుడు, కంసుడు, రావణుడు, కీచకుడు, హిరణ్యకశిపుడు... ఇలా అనేక రకాలుగా సమస్త దక్షిణ భారత ప్రేక్షకుల ముందు ఒక నటమాంత్రికుడు "ప్రతి నాయకుడి"గా ప్రత్యక్షమవుతాడు. ఆ మాంత్రికుడే ఎస్వీ. రంగారావు.
భయానకం, వీరం, రౌద్రం, కరుణం, శృంగారం, హాస్యం, శాంతం, బీభత్సం, అద్భుతం... అనే నవరసాలన్నింటినీ తన పాత్రల స్వభావంలో సునాయాసంగా ఒలికించి, అందరి మన్ననలు పొందిన మహానటుడు ఎస్వీ రంగారావు. ఏ పాత్ర అయినా దాంట్లో పరిపూర్ణ నటుడిని చూసిన అనుభూతిని కలిగించిన ఈ నటసార్వభౌముడి జన్మదినం.. తెలుగు చరిత్రలో జూలై 3వ తేదీకి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఈ మహానటుని శత జయంతి సందర్భంగా నా నివాళి.

Yamini Krishnamurthy - classical dancer of India

Charcoal pencil sketch  Mungara Yamini Krishnamurthy  (20 December 1940 – 3 August 2024) was an Indian classical dancer recognized for her c...